క్యాంపు కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు
కరీంనగర్ బంద్‌కు ప్రజలు సహకరించాలి
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపు
కాకతీయ, కరీంనగర్ : ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మధ్య భేదాభిప్రాయాలు సహజమని, అయితే కరీంనగర్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తన క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఈ దాడికి పాల్పడిన దోషులు ఎంతటి వారైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత సర్కార్‌పై ఉందని గుర్తు చేశారు. క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ శనివారం రోజున కరీంనగర్ నగర బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెల్లడించారు. ఈ బంద్‌కు నగరంలోని అన్ని వర్గాల ప్రజలు, వ్యాపార వాణిజ్య సంస్థలు శాంతియుతంగా మద్దతు ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుత పద్ధతిలో బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు పాల్గొని సంఘీభావం తెలపనున్నారు.

