సేవా కార్యక్రమాలతో పొన్నం జన్మదిన వేడుకలు
కరీంనగర్‌లో కాంగ్రెస్ శ్రేణుల సందడి
అన్నదానం, రక్తదానం, హెల్త్ క్యాంపులు
కాకతీయ, కరీంనగర్ : రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు కరీంనగర్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి సంబరాలను పండుగలా జరుపుకున్నారు. ఇందిరా చౌక్‌లో జిల్లా ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమ నాయకుడిగా, మంత్రిగా పొన్నం ప్రభాకర్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని కొనియాడారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య పరీక్షలు, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రజిత రెడ్డి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కుల మల్లేశం నేతృత్వంలో ఆర్టీసీ కార్మికులకు మిఠాయిలు పంపిణీ చేశారు. అలాగే జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్ విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేయగా, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య ఆధ్వర్యంలో హనుమాన్ మాలధారులకు అన్నదానం చేశారు. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచరులు, అభిమానులతో పాటు పలువురు కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల నాయకులు మరియు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు.

