దేశాభివృద్ధికి ‘జనగణన’ దిక్సూచి
ప్రతి పౌరుడు ఖచ్చితమైన వివరాలు ఇవ్వాలి
కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్
కాకతీయ, కరీంనగర్ : దేశ భవిష్యత్ అభివృద్ధికి, సంక్షేమ పథకాల రూపకల్పనకు భారత జనగణన–2027 అత్యంత కీలకమని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జనగణన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీలో మేయర్ పాల్గొని ప్రజలకు జనగణన ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్య, వైద్యం, ఉపాధి వంటి రంగాల్లో ప్రభుత్వ నిర్ణయాలకు ఈ గణాంకాలే ప్రాతిపదిక అని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం తమ సామాజిక, ఆర్థిక వివరాలను నమోదు చేసే సిబ్బందికి ఖచ్చితమైన సమాచారాన్ని అందించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు సరైన జనాభా గణాంకాలు అవసరమని, దీనికోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. జనగణన ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులు, కార్పొరేషన్ సిబ్బంది నినాదాలు చేస్తూ నగరంలో చైతన్యం నింపారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, పలువురు కార్పొరేటర్లు, అధికారులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

