బీజేపీ గుండాల్లారా ఖబడ్దార్!
గూండాగిరి చేస్తే ఊరుకోం
బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు రామతీర్థపు రాజు
కరీంనగర్ ఘటనపై వేములవాడలో బీఆర్‌ఎస్ నిరసన
కాకతీయ,వేములావాడ : “రాష్ట్రంలో ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావులేదు.. గూండాగిరి చేస్తే ఊరుకోం” అంటూ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు రామతీర్థపు రాజు, నిమ్మశెట్టి విజయ్ హెచ్చరించారు. కరీంనగర్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద భారీ ధర్నా నిర్వహించిన అనంతరం పోలీసు స్టేషన్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా “బీజేపీ గుండాలారా ఖబడ్దార్” అంటూ పార్టీ శ్రేణులు చేసిన నినాదాలతో పట్టణం మారుమోగింది.
హత్యాయత్నం చేయడం దుర్మార్గం..
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్, సిరిగిరి చందు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు హత్యాయత్నం చేయడం అత్యంత దారుణమని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై బీఆర్‌ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నాయని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నగరంలో తుపాకులతో దొంగతనాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని నిలదీశారు.
క్షమాపణ చెప్పాల్సిందే..
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనం, కార్యాలయంపై జరిగిన దాడికి బీజేపీ నాయకత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. అలాగే బీఆర్‌ఎస్ నాయకురాలు పావని గౌడ్‌పై దాడికి ప్రయత్నించిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు మారం కుమార్, వాసాల శ్రీనివాస్, కందుల క్రాంతి కుమార్ తో పాటు నిమ్మశెట్టి రాజు, అంజద్ పాషా, రేగుల రాజేశం, పెద్ది రాజు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

