కరీంనగర్లో ఫ్యాక్షన్ కల్చర్
బీజేపీ దాడులకు బీఆర్ఎస్ భయపడదు
బీజేపీ-కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు
బీఆర్ఎస్ సీనియర్ నేత జీవి రామకృష్ణారావు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్ఎస్ సీనియర్ నేత జీవి రామకృష్ణారావు తీవ్రంగా ఖండించారు. నగర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ గుండాయిజం చేస్తూ దాడులకు పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైనికులకు బదులు గూండాలను ప్రోత్సహిస్తూ నగరంలో ఫ్యాక్షన్ కల్చర్‌ను తీసుకువస్తున్నారని ఆరోపించారు. విమర్శలకు ప్రతివిమర్శలు ఉండాలి తప్ప, భౌతిక దాడులు చేయడం రాజకీయాల్లో సమంజసం కాదని హితవు పలికారు. బీఆర్ఎస్కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై ఈ దాడులకు పాల్పడుతున్నాయని బీఆర్ఎస్ నేత జీవి రామకృష్ణారావు విమర్శించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేసిన వ్యాఖ్యలే ఈ ఉద్రిక్తతలకు కారణమయ్యాయని పేర్కొన్నారు. బీజేపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదని, తాము కూడా తిరగబడితే బీజేపీ కార్యకర్తలు మిగలరని హెచ్చరించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ రైతు సమస్యలను గాలికి వదిలేసి కేవలం హిందుత్వ రాజకీయాలతో పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు.
బీజేపీ దాడులకు నిరసనగా శనివారం పిలుపునిచ్చిన కరీంనగర్ నగర బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేత జీవి రామకృష్ణారావు తో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

