ధాన్యం బస్తాలను తక్షణమే తరలించాలి
పది రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే వేలాది బస్తాలు
అన్నదాతల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి
చొప్పదండి మండలం ఆర్నకొండ రైతుల ఆగ్రహం
ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రాస్తారోకో
కాకతీయ, కరీంనగర్/చొప్పదండి : “నెలల తరబడి కష్టపడి పండించిన ధాన్యం కళ్లముందే తడిసిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? తూకం వేసిన బస్తాలను ఎందుకు తరలించడం లేదు?” అంటూ చొప్పదండి మండలం ఆర్నకొండ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో రైతులు రాష్ట్ర రహదారిపై భారీ రాస్తారోకో నిర్వహించారు. రవాణా లారీలు రాక, మిల్లర్లు దిగుమతి చేసుకోక కొనుగోలు కేంద్రాల్లోనే వేలాది బస్తాలు పేరుకుపోయాయని వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా బీజేపీ నేత సింగిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మండలంలో ఇప్పటివరకు కేవలం 10 శాతం ధాన్యం మాత్రమే సేకరించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రైతుల గోడు పట్టించుకోకుండా రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని విమర్శించారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుంటే కనీసం పాలిథిన్ కవర్లు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే లారీలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని తరలించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకులు మొగిలి మహేష్ తో పాటు పెద్ద సంఖ్యలో రైతులు, బీజేపీ మరియు బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఉద్రిక్తత నెలకొనడంతో చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్, రామడుగు ఎస్‌ఐ బందోబస్తు నిర్వహించారు.

