రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు
నేరాల నియంత్రణలో ప్రభుత్వం వైఫల్యం
పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం.. మహిళకు రక్షణ లేదు
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
కాకతీయ, మహబూబాబాద్ : రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని వారు ఆరోపించారు. ఆదివారం మహబూబాబాద్‌లోని మాజీ ఎంపీ మాలోత్ కవిత క్యాంపు కార్యాలయంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందుతో కలిసి వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఒకప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్ట ప్రస్తుత ప్రభుత్వ పాలనలో మసకబారుతోందని నేతలు విమర్శించారు. హోంశాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి.. నేరాల అదుపు కంటే రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం, వేధింపులకు పాల్పడడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారని ధ్వజమెత్తారు. కరీంనగర్లో జరిగిన భారీ నగల దుకాణం చోరీ, హైదరాబాద్‌లో ఐపీఎస్ అధికారి భార్య హత్య వంటి ఘటనలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో చట్టవ్యవస్థ ఎంత బలహీనపడిందో చెప్పడానికి ఈ వరుస నేరాలే నిదర్శనమని మండిపడ్డారు.
మహిళా రక్షణపై ఆందోళన
రాష్ట్రంలో మహిళలు, మైనర్ బాలికలకు రక్షణ కరువైందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను ప్రస్తావిస్తూ.. ఈ ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సున్నితమైన కేసుల్లో ప్రభుత్వం తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఇకనైనా రాజకీయ కక్షసాధింపులు వీడి ప్రజల భద్రతపై దృష్టి సారించాలని వారు హితవు పలికారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు, మహిళా నేతలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

