బేటీ బచావో నినాదం ఎటు పోయింది?
కొడుకు చేసిన తప్పును కప్పి పెట్టే ప్రయత్నం
కేంద్ర మంత్రి పదవికి బండి రాజీనామా చేయాలి
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ
హన్మకొండలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా
కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం
బండి తనయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
కాకతీయ, హనుమకొండ : కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన కుమారుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళా కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో శనివారం హనుమకొండ కాంగ్రెస్ భవన్ కూడలి వద్ద జిల్లా అధ్యక్షురాలు బంక సరళతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి తనయుడు బండి సాయి భగీరథ్‌పై మైనర్ బాలిక లైంగిక వేధింపుల కేసు నమోదైనా అరెస్టు చేయడంలో జాప్యం జరుగుతోందని విమర్శించారు. సాధారణ ప్రజలపై పోక్సో (POCSO) కేసులు నమోదైతే వెంటనే స్పందించే పోలీసులు, కేంద్ర మంత్రి కుమారుడి విషయంలో విచారణను నెమ్మదిగా సాగిస్తున్నారని ఆరోపించారు. అధికార అహంకారంతో చట్టాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం జరుగుతోందని, ఇది బాధాకరమని పేర్కొన్నారు.
బేటీ బచావో నినాదం ఎటు పోయింది?
దేశవ్యాప్తంగా ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అంటూ ప్రచారం చేసే బీజేపీ నాయకులు, తమ సొంత వారిపై ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని స్వర్ణ ప్రశ్నించారు. బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడే స్థాయికి పరిస్థితులు వెళ్లినా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కొనసాగడం బాధితురాలికి అన్యాయం చేయడమేనన్నారు. నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ప్రధాని మోదీ ఆయన్ను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

