డిప్యూటీ సీఎంను కలిసిన మధిర నియోజకవర్గ నూతన అధ్యక్షులు
కాకతీయ, ముదిగొండ : మల్లు భట్టి విక్రమార్కను మధిర నియోజకవర్గానికి చెందిన నూతన కాంగ్రెస్ అధ్యక్షులు ఆదివారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు నూతన అధ్యక్షులుగా నియామకమైన సందర్భంగా వారు డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ముదిగొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకమైన గుడిపుడి బుచ్చిరామయ్య, మధిర పట్టణ అధ్యక్షుడిగా తలుపుల వెంకటేశ్వర్లు, మధిర మండల అధ్యక్షుడిగా పారుపల్లి విజయ్ కుమార్ ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి భట్టి విక్రమార్కను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు నాయకులు ధన్యవాదాలు తెలియజేయగా, ఉప ముఖ్యమంత్రి నూతన అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి సంబంధించి పలు కీలక సూచనలు చేశారు.“కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, భావజాలానికి కట్టుబడి క్రమశిక్షణతో పని చేయాలి. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలి,” అని భట్టి విక్రమార్క సూచించారు.పార్టీ బలోపేతం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ముదిగొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

