కాశ్మీర్గడ్డలో దారుణం
తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కుమారుడు
మద్యం మత్తులో ఘర్షణ.. తల్లిపై దాడి చేయడంతో ఆగ్రహం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని కాశ్మీర్గడ్డలో కుటుంబ కలహాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. మద్యం మత్తులో తలెత్తిన గొడవ రక్తపాతానికి దారితీయగా.. కన్నతండ్రిని కుమారుడే గొడ్డలితో నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు మరియు పోలీసుల కథనం ప్రకారం.. ఆరెల్లి మల్లేష్ కుమారుడు నరసయ్య మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో ఇంట్లో గొడవ మొదలవ్వగా, నరసయ్య తన తల్లిపై దాడికి పాల్పడ్డాడు. కళ్లెదుటే భార్యను కొడుతుండటంతో తండ్రి మల్లేష్ అడ్డువచ్చారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నరసయ్య, ఇంట్లోని గొడ్డలిని తీసుకుని తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలైన మల్లేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పోలీసుల దర్యాప్తు..
ఈ ఘోర కలివిని చూసిన చిన్న కుమారుడు ఆరెల్లి రమేష్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. కేవలం తల్లిపై దాడిని అడ్డుకున్నందుకే ఈ హత్య జరిగిందా? లేక గతంలో ఏవైనా ఆస్తి వివాదాలు, పాత కక్షలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జనసమ్మర్థం ఎక్కువగా ఉండే కాశ్మీర్గడ్డ ప్రాంతంలో ఇలాంటి దారుణం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

