అక్రమ లేఅవుట్లకు కేరాఫ్‌గా కరీంనగర్ బల్దియా
ప్రభుత్వ భూముల్లో రియల్ ఎస్టేట్ సాగుతోంది
సూడా, మున్సిపల్ అధికారుల సహకారంతోనే దందా
మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ తీవ్ర ఆరోపణలు
అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర మున్సిపల్ కార్పొరేషన్‌లో అక్రమ లేఅవుట్లు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, టౌన్‌ప్లానింగ్ విభాగంలో అవకతవకలు యథేచ్ఛగా సాగుతున్నాయని కరీంనగర్ మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. మంగళవారం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు, శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సూడా) అధికారులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నగరంలో విలీనమైన గ్రామాల్లో కొత్తగా అక్రమ లేఅవుట్ల దందా ప్రారంభమైందని, దీనికి అధికారులే ప్రత్యక్షంగా సహకరిస్తున్నారని మండిపడ్డారు. నెల రోజుల క్రితమే పలు సర్వే నంబర్లలో జరుగుతున్న అక్రమ లేఅవుట్లపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
10 శాతం ప్రజా అవసరాల భూమి మాయం
నగరంలోని సర్వే నంబర్లు 52, 53, 85, 102, 115 ప్రాంతాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా ప్లాట్లు విక్రయిస్తున్నారని, ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని రవీందర్ సింగ్ తెలిపారు. అక్రమ లేఅవుట్ల కారణంగా ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల రూపాయల ఆదాయ గండి పడుతోందని విమర్శించారు. నిబంధనల ప్రకారం చట్టబద్ధమైన లేఅవుట్లలో 10 శాతం భూమిని పార్కులు, రోడ్లు, డ్రైనేజీ, పైప్‌లైన్‌లు, ఇతర సామాజిక అవసరాల కోసం కేటాయించాల్సి ఉంటుందని, కానీ ఇక్కడ అధికారులు ఆ నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టేశారని ఆరోపించారు. చింతకుంట ప్రాంతంలోని సర్వే నంబర్ 439లో ఏకంగా ప్రభుత్వ భూమినే ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.
గేటెడ్ కమ్యూనిటీల పేరుతో కొత్త అక్రమాలు
సూడా పరిధిలో గేటెడ్ కమ్యూనిటీల పేరుతో కొత్త తరహా అక్రమాలకు తెరలేపారని సర్ధార్ రవీందర్ సింగ్ ధ్వజమెత్తారు. కనీస మౌలిక సదుపాయాలు లేకుండానే లేఅవుట్లు మంజూరు చేస్తున్నారని, అల్గునూరు ప్రాంతంలో ప్రభుత్వ భూములు, సాగుభూములను ఓపెన్ ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని తెలిపారు. అపార్ట్‌మెంట్‌లలో భారీగా నిబంధనల ఉల్లంఘనలు (డివియేషన్లు) ఉన్నప్పటికీ, ముడుపులు తీసుకుని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. గతంలో రెండుసార్లు తిరస్కరించిన ఫైళ్లు, మూడోసారి ఎలా ఆమోదం పొందుతున్నాయని అధికారులను ప్రశ్నించారు. పేదలు చిన్న ఇల్లు కట్టుకుంటే నిబంధనల పేరుతో వేధించే అధికారులు, కోట్ల రూపాయల అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. వ్యవసాయ భూములను కన్వర్షన్ (ల్యాండ్ యూజ్ మార్పు) చేయకుండానే కమర్షియల్ ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. వెంటనే ఈ అక్రమ లేఅవుట్లను అరికట్టి, బాధ్యులైన అధికారులపై, రియల్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు.

