ధాన్యం తరలింపునకు లారీల సంఖ్యను పెంచాలి!
కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
కాకతీయ, ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని త్వరితగతిన తరలించేందుకు రవాణా కాంట్రాక్టర్లు లారీల సంఖ్యను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ మహేష్ బి గితే, ఇతర జిల్లా అధికారులతో కలిసి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రానికి ధాన్యం ఎంత వచ్చింది, ఇప్పటివరకు ఎంత కొనుగోలు చేశారనే వివరాలను అధికారులను అడిగి ఆరా తీశారు. కొనుగోలు పూర్తి చేసి తరలింపునకు సిద్ధంగా ఉన్న ధాన్యం సంచుల కోసం మరిన్ని వాహనాలను సమకూర్చాలని రవాణా కాంట్రాక్టర్లను ఆదేశిస్తూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
రైస్ మిల్లులో కలెక్టర్, ఎస్పీ తనిఖీ
అనంతరం ఇల్లంతకుంట మండలం చింతలకుంటపల్లె గ్రామంలోని శ్రీ లక్ష్మీసాయి రైస్ ఇండస్ట్రీస్‌ను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే అధికారులతో కలిసి తనిఖీ చేశారు. మిల్లుకు కేటాయించిన ధాన్యం లక్ష్యం ఎంత, ఇప్పటివరకు ఎంత అన్‌లోడ్ చేశారు, ఏయే మండలాల నుంచి ఇక్కడికి ధాన్యం వస్తోందనే అంశాలపై యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. మిల్లుల వద్ద లారీలు నిలిచిపోకుండా ఉండేందుకు హమాలీల సంఖ్యను పెంచాలని, అన్‌లోడింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీఓ) లక్ష్మీనారాయణ, జిల్లా పౌరసరఫరాల అధికారి (డీసీఎస్ఓ) బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, జిల్లా సహకార అధికారి (డీసీఓ) రామకృష్ణ, తహసీల్దార్ సురేష్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) శశికళ తదితరులు పాల్గొన్నారు.

