మోడల్ సిటీగా కరీంనగర్
బండి సంజయ్ కృషితోనే రూ.840 కోట్ల నిధులు
కేంద్ర పట్టణాభివృద్ధి నిధులతో మారనున్న రూపురేఖలు
తెలంగాణ చౌక్‌లో బీజేపీ నేతల సంబరాలు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) కింద రూ.840 కోట్ల భారీ నిధులు మంజూరు చేయడం చారిత్రాత్మకమని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. గురువారం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నిధులతో కరీంనగర్ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని, హైదరాబాద్ తర్వాత ఆధునిక సౌకర్యాలతో వేగంగా అభివృద్ధి చెందే నగరంగా ఇది నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలో మోడల్ రోడ్లు, స్కైవాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు, జంక్షన్ల అభివృద్ధి పనుల కోసం అత్యధికంగా రూ.630 కోట్లు కేటాయించినట్లు మేయర్ తెలిపారు. వీటి ద్వారా ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. అలాగే వర్షాకాలంలో ముంపు సమస్యల నివారణకు, డ్రెయిన్ల పునరుద్ధరణ పనుల కోసం రూ.130 కోట్లు, నగర పరిశుభ్రత, ఘన వ్యర్థాల నిర్వహణ కోసం మరో రూ.80 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. తొలుత యూసీఎఫ్ జాబితాలో కరీంనగర్ లేకపోయినా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పట్టుదల వల్లే ఈ నిధులు సాధ్యమయ్యాయని మేయర్ పేర్కొన్నారు. కరీంనగర్ అభివృద్ధిపై ఆయనకు ఉన్న నిబద్ధతకు ఇదే నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌లకు నగర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి రూపాయిని పారదర్శకంగా, నాణ్యతతో వినియోగించి పనులను వేగంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం తెలంగాణ చౌక్‌లో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్ కుమార్ చిత్రపటాలకు మేయర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

