టెన్త్‌లో ప్రతిభావంతులకు బహుమతుల ప్రదానం
కాకతీయ, ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రెండవ ఇన్‌స్టాలేషన్ మరియు పి.ఎస్.టి ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షుడు బండారి నర్సయ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా అలయన్స్ క్లబ్ ట్రస్ట్ జిల్లా చైర్మన్ డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, జిల్లా పీఆర్వో పుల్లెల శ్యామ్, జిల్లా వైస్ గవర్నర్ విద్యాసాగర్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అలయన్స్ క్లబ్ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి సభ్యుడు కృషి చేయాలని సూచించారు. యువత ఎక్కువగా లైఫ్ మెంబర్‌షిప్ తీసుకుని సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అలయన్స్ క్లబ్ కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు.
విద్యార్థులకు సత్కారం
ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన మండలంలోని వివిధ గ్రామాల విద్యార్థులకు క్లబ్ ఆధ్వర్యంలో ప్రోత్సాహక బహుమతులు, మెమెంటోలు అందజేసి సత్కరించారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి కూనబోయిన బాలరాజు, మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య, మాజీ క్లబ్ అధ్యక్షులు ఆనంద్ శర్మ, కోశాధికారి బొంగిని సత్యం, పీఆర్వో మామిడి రాజేల్లం, మీడియా ఇంచార్జ్ దయ్యాల సురేష్, సలహాదారులు పర్స ఐలయ్య, మొగిల్ల బాబు, సభ్యులు రేగుల కార్తీక్, అంతటి తిరుపతి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

