ఉర్సు మహోత్సవాలకు బిజిగిరి షరీఫ్ సిద్ధం
రేపటి నుంచి ఈ నెల 30 వరకు వేడుకలు
విద్యుత్ దీపాలతో దర్గా ముస్తాబు.. భక్తులకు భారీ ఏర్పాట్లు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బిజిగిరి షరీఫ్ హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి దర్గా ఉర్సు మహోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. గురువారం నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు ఈ నెల 30వ తేదీ వరకు భక్తి శ్రద్ధలతో కొనసాగనున్నాయి. ఈ వేడుకలకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. ఉత్సవాల సందర్భంగా దర్గాలో గుసుల్ షరీఫ్, చాదర్ సమర్పణ, ఖవ్వాలి వంటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దర్గా పరిసరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నదానం, తాగునీరు, వసతి, ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఉత్సవాల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను దర్గా కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పర్యవేక్షిస్తున్నారు.

