మహిళలు స్వయం ఉపాధిపై దృష్టి పెట్టాలి
ఇందిరా మహిళా శక్తి భవనాలను సద్వినియోగం చేసుకోవాలి
భవనాల నిర్మాణంలో రాష్ట్రంలోనే సిరిసిల్ల ప్రథమం
: కలెక్టర్ గరిమ అగ్రవాల్
రాజేశ్వరరావు కాలనీలో నూతన భవనం ప్రారంభం
కాకతీయ సిరిసిల్ల టౌన్ : మహిళా సంఘాల సభ్యులు తమ గ్రామాల్లో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనాలను సద్వినియోగం చేసుకోవాలని, స్వయం ఉపాధి రంగాలపై దృష్టి పెట్టి ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జరుగుతున్న మహిళా వారోత్సవాల సందర్భంగా గంభీరావుపేట మండలం రాజేశ్వరరావు కాలనీలో నూతనంగా నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవనాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర గ్రామైఖ్య సంఘం సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్.. మహిళా సంఘాల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. మహిళా సంఘాలు అంటే కేవలం రుణాలు తీసుకోవడం, చెల్లించడానికే పరిమితం కాకుండా.. క్రమం తప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేసుకుని సామాజికాంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతి సమావేశానికి మండల స్థాయి అధికారులను ఆహ్వానించి వారి సలహాలు స్వీకరించాలని కోరారు. జిల్లాలో ఇప్పటివరకు 113 ఇందిరా మహిళా శక్తి భవనాలకు అనుమతులు మంజూరు కాగా, 103 భవనాలు వివిధ దశల నిర్మాణాల్లో ఉన్నాయని, ఈ పురోగతిలో మన జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలోనే మొదటిగా రాజేశ్వరరావు కాలనీలో భవన నిర్మాణం పూర్తి కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ, తక్కువ సమయంలో పూర్తి చేసినందుకు నిర్వాహకులను అభినందించారు. మిగిలిన భవనాల నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కొమిరిశెట్టి విజయ, గ్రామీణాభివృద్ధి అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, తహసీల్దార్ మారుతి రెడ్డి, ఎంపీడీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

