మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం
జిల్లాలో 41 డ్రగ్స్ కేసులు.. 86 మంది అరెస్ట్
పాఠశాలల వద్ద పాన్‌షాపులపై ప్రత్యేక నిఘా
నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ చిత్రా మిశ్రా
కాకతీయ, కరీంనగర్, మే 28: మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమష్టిగా పనిచేయాలన్నారు. విద్యాసంస్థల్లో వీటి దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. డ్రగ్స్ సరఫరా, వినియోగంపై పోలీస్, ఎక్సైజ్ అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
పోలీస్ శాఖ పరిధిలో 11 కేసులు..
పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 11 డ్రగ్స్ కేసులు నమోదు చేసి 23 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి నుంచి 2.763 కిలోల గంజాయి, 12.2 గ్రాముల సింథటిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. విద్యాసంస్థల సమీపంలో పాన్‌షాపులు, సిగరెట్ దుకాణాలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, డ్రగ్స్ వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.
ఎక్సైజ్ పరిధిలో 30 కేసులు..
ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తమ శాఖ ఆధ్వర్యంలో 30 కేసులు నమోదు చేసి 63 మందిని అరెస్ట్ చేశామన్నారు. సుమారు 24 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, 15 వాహనాలను సీజ్ చేశామని వివరించారు. మరో 123 మందిపై బైండోవర్ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఎంహెచ్‌వో వెంకటరమణ, ఆర్డీవో మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

