త్యాగానికి, ప్రేమకు ప్రతిరూపం బక్రీద్
వైఎస్సార్ బాటలోనే ప్రజా ప్రభుత్వం
రేవంత్ రెడ్డి నాయకత్వంలో మైనార్టీల సంక్షేమం
వరంగల్ ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి కొండా సురేఖ
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ముస్లిం మైనార్టీల సంక్షేమానికి, ఆర్థిక అభ్యున్నతికి ప్రస్తుత ప్రజా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. పవిత్ర బక్రీద్ పండుగను పురస్కరించుకుని వరంగల్ నగరంలోని ఎల్బీనగర్, మట్టేవాడ, ఫోర్ట్ వరంగల్ ఈద్గాలలో నిర్వహించిన ప్రత్యేక సాకూహిక ప్రార్థనల్లో ఆమె పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖతో పాటు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు కూడా ఈ వేడుకల్లో భాగస్వామ్యులయ్యారు. ఈ సందర్భంగా ఈద్గా కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు కొండా దంపతులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
వైఎస్సార్ బాటలోనే ప్రజా ప్రభుత్వం
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. బక్రీద్ పండుగ త్యాగానికి, విశ్వాసానికి, అల్లాహ్‌పై ఉన్న అచంచలమైన విధేయతకు ప్రతీక అని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ముస్లిం మైనార్టీలకు కల్పించిన రిజర్వేషన్ల వల్ల ఎంతోమంది జీవితాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఆమె గుర్తుచేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అదే బాటలో మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. విద్య, ఉపాధి, ఆరోగ్య రంగాల్లో ముస్లింల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని వివరించారు.
సమస్యల పరిష్కారానికి కృషి
ముస్లిం సోదరులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. సమాజంలో శాంతి, సామరస్యాలు వర్ధిల్లాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని తాను అల్లాను ప్రార్థించినట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఈ సందర్భంగా మంత్రి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు.

