కష్టాలు తెచ్చిన కాంగ్రెస్ మట్టిలో కలవడం ఖాయం
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ఘోరంగా విఫలం
రైతులు విసిగిపోయి దళారులకు అమ్ముకునేలా కుట్రలు
వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
కాకతీయ, జూలూరుపాడు : తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలకు దుర్భర పరిస్థితులు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం మట్టికొట్టుకుపోవడం ఖాయమని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. అన్నదాతలపై ఈ ప్రభుత్వం కుట్రపూరిత చర్యలకు పాల్పడుతోందని, ధాన్యం సేకరించడంలో విఫలమవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతగానితనం, నిర్లక్ష్యమేనని తీవ్రస్థాయిలో ఆరోపించారు. రైతులకు ఉద్దేశపూర్వకంగానే సకాలంలో ఎరువులు ఇవ్వకుండా, కరెంట్ సరఫరాలో కోతలు పెడుతూ, కొనుగోలు కేంద్రాలలో తీవ్ర జాప్యం చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ పాలనే రైతులకు శ్రీరామరక్ష
రైతులు కొనుగోలు కేంద్రాల్లో వేచి చూడలేక, విసిగిపోయి తమ ధాన్యాన్ని దళారులకు తక్కువ ధరకే అమ్ముకుంటే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని గిరిబాబు విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ పంట చేతికి రాగానే వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి, వారం రోజుల్లోనే నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశారని గుర్తు చేశారు. కానీ నేడు రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలనలో రైతులు తమ రక్తం చెమటగా మార్చి పండించిన పంటను అమ్ముకోవడానికి నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తోందని, ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

