‘అమ్మానాన్న నన్ను క్షమించండి’..
సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యాయత్నం
కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మండలం విలాసాగర్‌లో చిట్టీ డబ్బుల వివాదం యువకుడి ఆత్మహత్యాయత్నానికి దారితీసింది. గ్రామానికి చెందిన అరుకాల సాయికుమార్ జమ్మికుంటకు చెందిన ఓ వ్యక్తి వద్ద రూ.6 లక్షల చిట్టీ డబ్బులు కట్టినట్లు తెలిసింది. గడువు ముగిసినా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పాటు తనకు చెందిన బంగారు గొలుసు, క్రెడిట్ కార్డులు కూడా ఇవ్వడం లేదని అతడు ఆరోపించాడు.
ఈ వ్యవహారంతో మనస్తాపానికి గురైన సాయికుమార్, “ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాను.. అమ్మానాన్న నన్ను క్షమించండి.. నేను చనిపోతున్నాను” అంటూ సెల్ఫీ వీడియో రికార్డు చేస్తూ పురుగుమందు సేవించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స కొనసాగుతోంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

