ఆకలికి అడ్డుకట్ట.. పేదలకు నెలనెలా ఉచిత బియ్యం
నర్సక్కపేటలో ఐదేళ్ల పాటు బియ్యం పంపిణీ చేస్తామన్న సర్పంచ్ శంకరమ్మ
కాకతీయ, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నర్సక్కపేట గ్రామంలో పేద కుటుంబాలకు సర్పంచ్ బెంద్రం శంకరమ్మ ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని నిరుపేదలకు ప్రతి నెల 10 కిలోల చొప్పున బియ్యం అందజేస్తూ సామాజిక బాధ్యతను చాటుతున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ శంకరమ్మ మాట్లాడుతూ, గ్రామంలోని పేద ప్రజలకు అండగా నిలవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో భాగంగా ప్రతి నెల బియ్యం పంపిణీ కొనసాగుతుందని, ఈ సేవా కార్యక్రమాన్ని ఐదేళ్లపాటు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
పేద కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యమని ఆమె తెలిపారు. గ్రామ అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముత్యం తిరుపతి, నిరటి మధు, నిరటి వెంకటేష్, బద్దం తిరుపతి రెడ్డి, బొల్ల మల్లారెడ్డి, అన్నడి ఎల్లారెడ్డి, బద్దం సత్తిరెడ్డి, బెంద్రం సత్యనారాయణ, దూది శ్రీనివాస్, చందు తదితరులు పాల్గొన్నారు.

