చౌకకు వస్తుందని కొనేస్తే చట్టపరమైన చిక్కులే..!
సెకండ్ హ్యాండ్ మొబైల్స్, బైకుల కొనుగోలులో జాగ్రత్త
ఎస్సై శేఖర్ రెడ్డి హెచ్చరిక
కాకతీయ,శంకరపట్నం:సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు (బైకులు) కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్సై కట్కూరి శేఖర్ రెడ్డి సూచించారు. ఇటీవల కొందరు గుర్తుతెలియని వ్యక్తులు, దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులు మొబైల్ ఫోన్లు, బైకులను చోరీ చేసి తక్కువ ధరలకు విక్రయిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. అత్యవసరంగా డబ్బులు అవసరమని నమ్మించి, అసలు ధర కంటే చాలా తక్కువ మొత్తానికి మొబైల్ ఫోన్లు, బైకులను అమ్మడం లేదా తాకట్టు పెట్టడం వంటి చర్యలకు కొందరు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. డబ్బులు తీసుకున్న అనంతరం వారు తిరిగి కనిపించకపోవడంతో కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దొంగిలించబడిన వస్తువులపై అసలు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుంటారని చెప్పారు. ఈ సందర్భంలో సరైన పత్రాలు లేకుండా కొనుగోలు చేసిన వారు చట్టపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. దొంగతనం చేసిన వస్తువులను కొనుగోలు చేయడం లేదా తమ వద్ద ఉంచుకోవడం కూడా చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. సెకండ్ హ్యాండ్ మొబైల్ లేదా బైక్ కొనుగోలు చేసే ముందు అసలు కొనుగోలు రసీదు, రిజిస్ట్రేషన్ పత్రాలు, యజమాని గుర్తింపు కార్డులు తదితర ఆధారాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. అనుమానాస్పదంగా ఎవరైనా తక్కువ ధరలకు వస్తువులు విక్రయించేందుకు ప్రయత్నిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్-100కు సమాచారం అందించాలని కోరారు. ఎటువంటి రసీదులు, ఆధారాలు లేని వస్తువులను కొనుగోలు చేసి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని మండల ప్రజలకు కేశవపట్నం ఎస్సై విజ్ఞప్తి చేశారు.

