ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు
అవని కళాశాల ఆధ్వర్యంలో బోర్డుల ఏర్పాటు
ప్రారంభించిన దుగ్గొండి ఎస్సై రణధీర్
కాకతీయ, దుగ్గొండి : రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో దుగ్గొండి మండలంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు. స్థానిక అవని కళాశాల ఆధ్వర్యంలో మండలంలోని ప్రధాన రోడ్లపై పది సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో, వాహనదారుల్లో చైతన్యం పెంపొందించేందుకు ఈ బోర్డులను ఏర్పాటు చేసినట్లు దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్, అవని కళాశాల డైరెక్టర్ అంబరగొండ గీత సంతోష్ లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోడ్డు ప్రయాణంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీటుబెల్ట్ ధరించాలని కోరారు. ప్రాణాలు తీసే మద్యం సేవించి వాహనాలు నడపడం (డ్రంక్ అండ్ డ్రైవ్) వంటి పనులకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. మండలంలోని ప్రధాన కూడళ్లు, మలుపులు, ప్రమాదాలకు ఆస్కారం ఉన్న బ్లాక్ స్పాట్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ సూచిక బోర్డులు వాహనదారులను అప్రమత్తం చేస్తూ మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసులదో, ప్రభుత్వానిదో కాదని.. అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఎస్సై రణధీర్ గుర్తుచేశారు. క్షణకాలం పాటు చేసే చిన్న నిర్లక్ష్యం కూడా ఒక కుటుంబంలో పెద్ద ప్రాణనష్టానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కళాశాల యాజమాన్యం సామాజిక బాధ్యతతో ఈ బోర్డులను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అవని కళాశాల ప్రతినిధులు, అధ్యాపకులు, పోలీస్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

