పొగ మంచులా కమ్మేసింది.. ప్రాణం తీసింది!
రెండు బైకులు ఢీకొని యువకుడు ఎర్ర నర్సయ్య మృతి
వరి కొయ్యల దహనమే ప్రమాదానికి కారణం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
కాకతీయ, చేర్యాల : చేర్యాల మండలంలోని గుర్జకుంట గ్రామ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్లమ్మ ఆలయం వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చేర్యాల ఎస్సై అపూర్వ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుర్జకుంటకు చెందిన రైతు గర్నెపల్లి సిద్దయ్య తన వ్యవసాయ పొలంలో వరి కొయ్యలకు (గడ్డికి) నిప్పు పెట్టాడు. దీంతో రోడ్డుపై భారీగా పొగ కమ్మేసింది. ఆ సమయంలో రోడ్డు మీదుగా చేర్యాల వైపు వెళ్తున్న ఎర్ర నర్సయ్య (30), అలాగే గుర్జకుంట వైపు వస్తున్న బండారి రమేష్, నంగి రాజులకు పొగ కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించలేదు. ఈ క్రమంలో రెండు బైకులు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎర్ర నర్సయ్య తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన రాజు, రమేష్‌లను కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. మృతుడు, క్షతగాత్రుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు నర్సయ్య తల్లిదండ్రులు కొన్ని ఏళ్ల క్రితమే చనిపోయారు. ఉన్న ఒక్క అన్నయ్యే తనకు సర్వస్వమని భావించిన వివాహిత అయిన చెల్లెలికి ఈ ప్రమాదం తీరని శోకాన్ని మిగిల్చింది. తల్లిదండ్రులతో పాటు ఆదరించే అన్నను కూడా కోల్పోయానంటూ ఆమె చేసిన కన్నీటి రోదనలు గ్రామంలో అందరినీ కంటతడి పెట్టించాయి.

