వేములవాడలో కార్గో సేవలు బంద్
గడువు ముగియడం అద్దె భారంతో కార్గో నిర్వహణకు సమస్యలు
పార్సిళ్లు సరుకుల రవాణాకు వినియోగదారులకు అసౌకర్యం
త్వరలోనే కొత్త టెండర్ నిర్వహించి సేవలను పునరుద్ధరిస్తాం : డిపో మేనేజర్ శ్రీనివాస్
కాకతీయ, వేములవాడ : వేములవాడలో ఆర్టీసీ కార్గో సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో ప్రజలు వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్సిళ్లు ముఖ్యమైన డాక్యుమెంట్లు చిన్న వ్యాపారుల సరుకుల రవాణాకు ఉపయోగపడే కార్గో సేవలు అందుబాటులో లేకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై వేములవాడ డిపో మేనేజర్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా కార్గో సేవలు శాశ్వతంగా నిలిచిపోలేదని స్పష్టం చేశారు. కార్గో నిర్వహణకు సంబంధించిన టెండర్ ప్రక్రియ ప్రస్తుతం ఆగిపోయిందని త్వరలోనే కొత్త టెండర్‌ను నిర్వహిస్తామని తెలిపారు. కార్గో టెండర్‌కు ఎవరూ ముందుకు రాకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. స్థానికంగా కార్గో సేవలు నిర్వహిస్తున్న కేంద్రం ఒప్పంద గడువు ముగియడంతో పాటు షాప్ అద్దె భారం అధికంగా ఉండటమే సేవలు స్తంభించడానికి ప్రధాన కారణమని సమాచారం. ప్రతిరోజూ ఆర్టీసీ కార్గో సేవలపై ఆధారపడే ప్రజలు ప్రస్తుతం తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. సేవలు నిలిచిపోవడంతో పార్సిళ్లు పంపించుకోవాలన్నా స్వీకరించాలన్నా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే పునరుద్ధరణ
కార్గో కేంద్రం నిర్వహణలో ఆర్థిక ఇబ్బందులు ముఖ్యంగా షాప్ అద్దె అధికంగా ఉండటం వల్ల నిర్వాహకులు కొనసాగించలేకపోయారని తెలుస్తోంది. వేములవాడ వంటి ప్రధాన పుణ్యక్షేత్రంలో కార్గో సేవలు నిలిచిపోవడంపై అధికారులు స్పందించి పునరుద్ధరణపై స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. కార్గో సేవలను నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న వారు డిపో అధికారులను సంప్రదించాలని డిపో మేనేజర్ శ్రీనివాస్ సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి కార్గో సేవలను తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

