పర్యావర పరిరక్షణ అందరి బాధ్యత
ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
కాలుష్య నివారణకు ఈవీ పాలసీ.. రూ. 1200 కోట్ల రాయితీ
ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్‌కు స్టీల్ కిట్ల పంపిణీ
ఇందిరమ్మ ఇళ్ల ఆవరణల్లో ఉపయోగకరమైన మొక్కలు నాటాలి
కరీంనగర్ డీర్ పార్క్‌లో మొక్కలు నాటిన మంత్రి పొన్నం ప్రభాకర్
కాకతీయ, కరీంనగర్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పట్టణంలోని డీర్ పార్క్‌లో నిర్వహించిన మొక్కల నాటే కార్యక్రమంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం కేవలం శుభాకాంక్షలకే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ ప్రజల సహకారం ఉంటేనే అవి విజయవంతమవుతాయని పేర్కొన్నారు.
హుస్నాబాద్‌కు ఉత్తమ అవార్డు
హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో 280 మహిళా సంఘాలకు, 500 హోటళ్లకు స్టీల్ కిట్లు పంపిణీ చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ పర్యావరణహిత చర్యల ఫలితంగానే హుస్నాబాద్ మున్సిపాలిటీ, సూర్యాపేటతో కలిసి ఉత్తమ మున్సిపాలిటీ అవార్డు అందుకోబోతున్నట్లు పేర్కొన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి గ్రామంలో ఐదుగురు సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేశామని, రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న నాలుగు లక్షల ఇందిరమ్మ ఇళ్లలో కరివేపాకు, మునగ, జామ వంటి ఉపయోగకరమైన మొక్కలను తప్పనిసరిగా నాటాలని సూచించారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్ కాలుష్య నగరంగా మారకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈవీ పాలసీ అమలు చేస్తోందని, ఇందుకోసం సుమారు రూపాయలు 1,200 కోట్ల పన్ను రాయితీలు కల్పించినట్లు వెల్లడించారు.
ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోందని, భవిష్యత్తులో నీటి కొరత రాకుండా వర్షపు నీటిని సంరక్షించే చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. పట్టణాల్లో ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించవచ్చన్నారు. “ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది, వృక్షో రక్షతి రక్షితః అనే భావనతో ముందుకు సాగాలి” అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తల్లి పేరుతో ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

