త్వరలో కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం
మల్లన్న భక్తులకు సుగమం కానున్న ప్రయాణం
రూ. 5.63 కోట్లతో అత్యాధునిక నిర్మాణం
మనోహరాబాద్-కొత్తపల్లి మార్గంలో కీలక స్టేషన్
హైదరాబాద్ నుంచి నేరుగా మల్లన్న దర్శనానికి అవకాశం
ప్రాంతీయ అభివృద్ధికి, పర్యాటకానికి పెద్దపీట
వ్యాపార, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్న వైనం
ప్రాజెక్టు 99 శాతం పూర్తి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడి
కాకతీయ, కొమురవెల్లి : కొమురవెల్లి మల్లన్న భక్తుల చిరకాల కోరిక త్వరలో నెరవేరనుంది. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే మార్గంలో సుమారు రూ. 5.63 కోట్ల వ్యయంతో నిర్మించిన కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ కొత్త స్టేషన్ అందుబాటులోకి వస్తే, హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు నేరుగా రైలు మార్గంలో కొమురవెల్లి చేరుకునే వెసులుబాటు కలుగుతుంది. ఈ రైల్వే స్టేషన్‌ను ప్రయాణికుల సౌకర్యార్థం ఆధునిక హంగులతో నిర్మించారు. స్టేషన్ భవనంలో విశాలమైన వెయిటింగ్ హాల్స్, టికెట్ కౌంటర్లు, ప్రవేశ ద్వారాలు మరియు అత్యాధునిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు స్టేషన్ నుంచి ఆలయం వరకు ప్రత్యేక రహదారి అనుసంధాన పనులను కూడా అధికారులు పూర్తి చేశారు. దీనివల్ల రోడ్డు మార్గంపై భక్తులపై ఉన్న భారం తగ్గడమే కాకుండా, ప్రయాణ సమయం, ఖర్చు ఆదా కానున్నాయి.

అభివృద్ధికి ఊతం.. పర్యాటకానికి ప్రోత్సాహం
కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం కేవలం రవాణా సౌకర్యానికే పరిమితం కాకుండా, స్థానిక ప్రాంత అభివృద్ధికి భారీ ఊతాన్నివ్వనుంది. వ్యాపార, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పర్యాటక రంగం మరింత విస్తరించనుంది. ఈ క్రమంలోనే పనుల పురోగతిపై స్పందించిన కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి, ప్రాజెక్టు 99 శాతం పూర్తయిందని తన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. త్వరలోనే ఈ స్టేషన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించడంతో స్థానికులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

