అంగవైకల్యంతో కుమారుడు..తల్లడిల్లుతున్న తండ్రి
కుమారుడిని, తనను భార్య వదిలివెళ్లిందని ఆవేదన
భార్య తనపై వరకట్న వేధింపుల కేసు పెట్టిందని కన్నీరు
ఆదుకుని న్యాయం చేయాలని కలెక్టర్‌కు వినతి
కాకతీయ జగిత్యాల : అంగవైకల్యంతో బాధపడుతున్న తన కుమారుడిని ఒంటరిగా పెంచుకుంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, తనకు న్యాయం చేయాలని కోరుతూ కథలాపూర్ మండలం గంభీర్పూర్ చెందిన సురేష్ సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… ఆరు సంవత్సరాల క్రితం జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది. వీరికి జన్మించిన కుమారుడు ఎదుగుదల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ప్రస్తుతం మంచానికే పరిమితమయ్యాడు. కుమారుడు అంగవైకల్యంతో జన్మించడంతో రెండేళ్ల క్రితం భార్య తనను, కుమారుడిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయిందని సురేష్ తెలిపారు. కుమారుడి సంరక్షణకు తాను చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని కూడా వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇదిలా ఉండగా భార్య తనపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేయడంతో ఒకవైపు కోర్టుల చుట్టూ, మరోవైపు కుమారుడి వైద్యం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్ అదాలత్ ద్వారా తనపై నమోదైన కేసును ఉపసంహరించుకునేలా అధికారులు చొరవ చూపాలని, తన కుటుంబ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలని వినతిపత్రంలో కోరారు.

