భూసేకరణను వేగిరం చేయాలి
ఆర్అండ్‌ఆర్ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు
సీతారామ, సీతమ్మసాగర్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష
రైతులకు న్యాయమైన పరిహారం అందేలా చూడాలని అధికారులకు ఆదేశం
కాకతీయ, అశ్వాపురం/మణుగూరు : జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్&ఆర్, ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన అశ్వాపురం మండలంలోని సీతమ్మసాగర్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పరిశీలించారు. అనంతరం బీజీ కొత్తూరులోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అంకిత్‌తో కలిసి భూసేకరణ పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్, సీతమ్మసాగర్ బహుళార్ధక, పులుసుబొంత, సింగభూపాలెం ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పరిహారం చెల్లింపులు, అటవీ అనుమతులు మరియు కోర్టు కేసుల వివరాలను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న అడ్డంకులను వెంటనే తొలగించి, నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు న్యాయమైన పరిహారం సకాలంలో అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
కలెక్టర్ అంకిత్ వెల్లడించిన వివరాలు
సమీక్షలో జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఫేజ్-1, ఫేజ్-2 కింద అవార్డుల జారీని పూర్తి చేసి పరిహారం చెల్లించామని తెలిపారు. ఫేజ్-3లో భూసేకరణ పనులు కొనసాగుతున్నాయని, ప్రభుత్వ నిధులు అందగానే మిగిలిన వారికి పరిహారం చెల్లింపులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పనులు పురోగతిలో ఉన్నాయని, త్వరలోనే భూములను పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని వివరించారు. ఈ సమావేశంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎస్‌ఈ శ్రీనివాస్ రెడ్డి, ల్యాండ్ సర్వే ఏడీ శ్రీనివాసరావు, ఎస్‌డీఎల్‌సీలు రవీంద్రనాథ్, వెంకట్రావు, తహసీల్దార్లు, భూసేకరణ విభాగ అధికారులు పాల్గొన్నారు.

