తడిగుడ్డతో రైతుల గొంతు కోసిన కాంగ్రెస్
33 రకాల సన్నాల నుంచి 7 రకాలకే బోనస్ పరిమితం
రాహుల్ గాంధీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ హామీలు తుంగలో
కొనుగోళ్లు, రైతుబంధు, రైతుబీమా, యూరియా అన్నీ ఖతం
జొన్నలు, మక్కల కొనుగోళ్ల బాధ్యత నుంచి తప్పుకునే కుట్ర
వరంగల్ జిల్లాలో తీవ్రమైన యూరియా కొరత
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
కాకతీయ, నర్సంపేట టౌన్ : ఎన్నికల ముందు రైతులకు భారీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతాంగాన్ని నట్టేట ముంచి తడిగుడ్డతో గొంతు కోసిందని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు కేంద్రం చెప్పిన పంటలనే కొనుగోలు చేస్తామని ప్రకటించడం రైతులను దారుణంగా మోసం చేయడమేనని విమర్శించారు. శనివారం నర్సంపేటలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ ప్రకటించిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కిందని పెద్ది సుదర్శన్ రెడ్డి ధ్వజమెత్తారు. సన్నరకాల వరికి బోనస్ ఇస్తామని ప్రకటించి మొదట 33 రకాల వరి రకాలను గుర్తించిన ప్రభుత్వం, ఇప్పుడు కేవలం 7 రకాలకే పరిమితం చేయడం వెనుక బోనస్ ఎగ్గొట్టే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. రైతులకు ఎక్కువ దిగుబడి వచ్చే రకాలను పక్కనపెట్టి, తక్కువ దిగుబడి వచ్చే రకాలకే బోనస్ వర్తింపజేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని నమ్మించి, ఇప్పుడు కేంద్రం ఎంత కొనమంటే అంతే కొంటామని చెప్పడం కాంగ్రెస్ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు.
కేసీఆర్ హయాంలో అండగా నిలిచాం
కేసీఆర్ హయాంలో కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసినా, చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే పంటలను కొనుగోలు చేసి రైతులకు మద్దతుగా నిలిచిందని పెద్ది సుదర్శన్ రెడ్డి గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోళ్ల బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కేంద్రం జొన్నలు, మక్కలు కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనబోదన్న సంకేతాలు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. మిర్చి సాగు విస్తారంగా ఉన్న వరంగల్ జిల్లాలో రైతులకు అవసరమైనంత యూరియా అందడం లేదని, కేవలం రెండు బస్తాలతో రైతులు ఎలా సాగు చేయాలని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతుల సమస్యలను పూర్తిగా గాలికొదిలేశాయని విమర్శించారు.
పథకాలన్నీ పూర్తిగా నిర్వీర్యం
రైతుబంధు, రైతుబీమా పథకాల అమలులోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ముందు రైతుబంధును పెంచుతామని చెప్పి అసలుకే ఎగ్గొట్టారని, రైతుబీమా చెల్లింపులు కూడా నెలల తరబడి పెండింగ్‌లో ఉంచారని అన్నారు. కొనుగోళ్లు ఖతం, రైతుబంధు ఖతం, రైతుబీమా ఖతం, యూరియా ఖతం చేస్తూ రైతులకు ఏమీ మిగల్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేక నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకుని, రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, బీఆర్టీయూ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

