ఈఓ డ్రైవర్‌కు టికెట్ కౌంటర్ బాధ్యతలు
కొండగట్టు ఆలయంలో ఇష్టారాజ్యం
కాకతీయ, కరీంనగర్/కొండగట్టు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో విధుల నిర్వహణపై వివాదం రాజుకుంది. ఆలయ ఈఓ అంజనా రెడ్డికి వ్యక్తిగత కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తి, ఏకంగా ఆలయ ఉద్యోగిలా టికెట్ క్యాష్ కౌంటర్ వద్ద విధులు నిర్వహిస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం వేల రూపాయల నగదు లావాదేవీలు జరిగే అత్యంత కీలకమైన కౌంటర్ వద్ద, అధికారిక నియామకం లేని వ్యక్తికి బాధ్యతలు అప్పగించడంపై భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ప్రశ్నించిన వారికి, ఈఓ అంజనా రెడ్డి ఆదేశాల మేరకే తాను విధులు నిర్వహిస్తున్నానని సదరు డ్రైవర్ చెబుతుండటం గమనార్హం. కేవలం కౌంటర్ విధులే కాకుండా, కింది స్థాయి ఆలయ ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. బాధ్యతాయుతమైన విభాగంలో ప్రైవేట్ వ్యక్తిని కూర్చోబెట్టి, ఆదాయానికి సంబంధించిన నగదు లావాదేవీలను పర్యవేక్షించనివ్వడంపై భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆలయ ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా కౌంటర్ బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తిపై, అతనికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

