ఎస్‌ఐఆర్ పై ఏజెంట్లకు పూర్తి అవగాహన ఉండాలి
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి
తప్పుల్లేని ఓటర్ల జాబితా రూపకల్పనలో ఏజెంట్ల పాత్ర కీలకం
హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల
ఆత్మకూరులో కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశం
కాకతీయ, ఆత్మకూరు : కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై బూత్ లెవల్ ఏజెంట్లకు (బీఎల్‌ఏ) పూర్తి అవగాహన ఉండాలని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి సూచించారు. గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల అవగాహన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రతి కాంగ్రెస్ ఏజెంట్ పూర్తి అవగాహనతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా బూత్ లెవల్ ఏజెంట్లు ప్రత్యేక చొరవ చూపాలని ఇనగాల కోరారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా కొత్త ఓటర్ల నమోదు (ఫారాల సేకరణ), ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ, శాశ్వతంగా వలస వెళ్లిన వారు మరియు మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి అంశాలపై ఏజెంట్లు నిరంతరం అలర్ట్‌గా ఉండాలన్నారు. తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా అత్యంత పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనలో భాగస్వాములు కావాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఆత్మకూరు గ్రామ సర్పంచి పర్వతగిరి మహేశ్వరి రాజు, కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు ఆయా పోలింగ్ బూత్‌ల లెవల్ ఏజెంట్లు పాల్గొన్నారు.

