చేర్యాలలో కనిపించని అభివృద్ధి
మున్సిపల్ పాలనపై ప్రజల తిరుగుబాటు స్వరం!
పాలకవర్గంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న స్థానికులు
వార్డులకు ముఖం చాటేసిన కౌన్సిలర్లు
పబ్లిక్ టాయిలెట్ల తొలగింపుతో మహిళలు, వృద్ధుల అవస్థలు
కాకతీయ,చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు పూర్తిగా కుంటుపడ్డాయని, కనీస మౌలిక వసతులు కల్పించడంలో పాలకవర్గం ఘోరంగా విఫలమైందని స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, అంతర్గత వీధులు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్య నిర్వహణ వంటి ప్రతి అంశంలోనూ సమస్యలు పేరుకుపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ పాలకవర్గం పట్టణ ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో ప్రజలకు నిత్యం నరకప్రాయంగా మారింది. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మురుగు కాల్వలు సక్రమంగా లేకపోవడం వల్ల చాలా ప్రాంతాల్లో రోడ్లపైనే మురుగునీరు నిల్వ ఉండి దోమలు, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వాపోతున్నారు. ఎన్నికల సమయంలో తమ వార్డులను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఇచ్చిన హామీలు నేటికీ అమలు కాలేదని, చేర్యాల పట్టణాభివృద్ధి కేవలం కాగితాలకే, మైకు ప్రకటనలకే పరిమితమైందని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మౌలిక వసతుల కల్పనలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ప్రజా సమస్యలను గాలికొదిలేసిన కౌన్సిలర్లు
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి అండగా నిలవాల్సిన పలువురు కౌన్సిలర్లు తమ బాధ్యతలను పూర్తిగా విస్మరించారని చేర్యాల పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కాళ్లు పట్టుకున్న ప్రజాప్రతినిధులు, గెలిచిన తర్వాత వార్డుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా వార్డుల్లో అంతర్గత రోడ్లు గుంతలమయంగా మారడం, వీధి దీపాలు వెలగకపోవడం, పారిశుధ్య లోపాల వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను ఎన్నిసార్లు కౌన్సిలర్ల దృష్టికి తీసుకెళ్లినా కనీస స్పందన కరువైందని, దీంతో స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందని పేర్కొంటున్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ప్రజాప్రతినిధులు పూర్తిగా ఫెయిల్ అయ్యారని, ఇప్పటికైనా వారు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని, లేదంటే రాబోయే రోజుల్లో వార్డుల్లోకి వస్తే గెరావ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
పబ్లిక్ టాయిలెట్లపై కనీస శ్రద్ధ లేని మున్సిపల్ అధికారులు
పట్టణంలో ప్రజల అత్యవసర సౌకర్యాల కోసం గతంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లు ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యం వల్ల అధ్వాన్నంగా తయారయ్యాయి. కనీస నిర్వహణ లేకపోవడం, పరిశుభ్రత పూర్తిగా దెబ్బతినడం, నీటి సదుపాయం కల్పించకపోవడం వల్ల అవి కాస్తా అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు పట్టణంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్ పరిసరాలు, మార్కెట్ ప్రాంతాల్లో ఉన్న పబ్లిక్ టాయిలెట్లను మున్సిపల్ అధికారులు ఉద్దేశపూర్వకంగా తొలగించడంతో మార్కెట్కు వచ్చే మహిళలు, వృద్ధులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు.. కనీస మౌలిక వసతుల నిర్వహణను ఎందుకు గాలికొదిలేశారని ప్రజలు నిలదీస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని చేర్యాల మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, లేదంటే మున్సిపల్ ఆఫీస్ ముట్టడికి, ఉమ్మడి ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

