భక్తులతో కిటకిటలాడిన వేములవాడ
కాకతీయ, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి శుక్రవారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి చేరుకున్న భక్తులు స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం పర్వదినం కావడంతో ఆలయ ప్రాంగణం రోజంతా భక్తుల రద్దీతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు కోడె మొక్కులు, రుద్రాభిషేకం, అన్నపూజ, నిత్య కల్యాణం, చండీ హోమం మరియు కుంకుమ పూజ వంటి విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తుల శివనామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్ల నిర్వహణ, దర్శన ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి పర్యవేక్షించారు. సిబ్బంది భక్తులకు అవసరమైన సహాయ సహకారాలు అందించారు. రోజంతా భక్తుల రాకతో వేములవాడలోని భీమేశ్వర స్వామి ఆలయం భక్తజన సందోహంతో కిటకిటలాడింది.

