తొమ్మిదేళ్లుగా తాత్కాలిక భవనాలే శరణ్యం!
తహసీల్దార్, వ్యవసాయ శాఖ కార్యాలయాలకు కరువైన శాశ్వత భవనాలు
రూ.2.50 కోట్ల నిధులున్నా ముందుకు సాగని పోలీస్ స్టేషన్ నిర్మాణం
కాకతీయ, రుద్రంగి : ప్రజలకు పరిపాలనను చేరువ చేయాలనే లక్ష్యంతో రెండు వేల పదహారులో ఏర్పాటైన రుద్రంగి మండలం తొమ్మిదో ఏటా అడుగుపెడుతున్నా, కీలక ప్రభుత్వ శాఖలకు ఇప్పటికీ సొంత భవనాలు లేవు. మండల పరిపాలనకు వెన్నెముకైన తహసీల్దార్ కార్యాలయం, విద్యాశాఖ అధికారి కార్యాలయంలోనే కొనసాగుతోంది. ఒకే ఇరుకు భవనంలో రెవెన్యూ సేవలు, విద్యాశాఖ విధులు నిర్వహించాల్సి రావడంతో ప్రజలు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయాధారిత ప్రాంతమైన రుద్రంగిలో రైతులకు సేవలు అందించే వ్యవసాయ శాఖకు సైతం శాశ్వత భవనం కరువైంది. మరోవైపు, కొత్త పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి ప్రభుత్వం రెండు కోట్ల యాభై లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై నాలుగున రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ల సమక్షంలో ఘనంగా శంకుస్థాపన కూడా జరిగింది. అయితే, రెండు నెలలు గడుస్తున్నా నిర్మాణ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి, అన్ని శాఖలకు శాశ్వత భవనాలు నిర్మించి ఒకే పరిపాలనా సముదాయం కిందకు తేవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

