వీరాపురం ఇసుక రీచ్ వివాదాన్ని పరిష్కరించాలి
రెండు ఆదివాసి సొసైటీలకు సమన్యాయం చేయాలి
తుడుం దెబ్బ నాయకుల డిమాండ్
పినపాక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
కాకతీయ, పినపాక : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని దుగినేపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న వీరాపురం ఇసుక రీచ్ వివాదాన్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, రెండు గిరిజన సొసైటీలకు సమన్యాయం చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు అలెం కోటి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం తుడుం దెబ్బ ఆధ్వర్యంలో పినపాక తహసీల్దార్ కార్యాలయం ఎదుట శాంతియుత ధర్నా చేపట్టి, అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అలెం కోటి మాట్లాడుతూ, ఇసుక రీచ్ వివాదం కారణంగా గిరిజన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసుల మధ్య విభేదాలు పెరగడం వల్ల సమాజ ఐక్యత దెబ్బతినడమే కాకుండా, మహిళల ఆర్థిక భద్రత, యువత భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించారు. వివాదాలను రెచ్చగొట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని కోరారు. వీరాపురం ఇసుక రీచ్ విషయంలో రెండు గిరిజన సొసైటీలకు ప్రభుత్వం నిష్పాక్షికంగా న్యాయం చేయాలి. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజన రైతులకు లభించిన హక్కులను గౌరవించి, వారు తమ భూముల్లో నిరభ్యంతరంగా సాగు చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్తిరాజు, ఆదివాసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ వాసం రామకృష్ణ దొర, శ్రీగిరి లక్ష్మి సొసైటీ సభ్యులు, ఆదివాసి మహిళలు, యువత మరియు పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

