ఉపాధ్యాయుల గౌరవాన్ని దెబ్బతీయొద్దు..
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను పునఃపరిశీలించాలి
ప్రభుత్వ విధానాలపై ఉద్యోగుల్లో అసంతృప్తి
రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లా
పెండింగ్ డీఏలు విడుదల చేసి, పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్
కాకతీయ, చేర్యాల: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు టిఫిన్, మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలు, పీఆర్సీ అమలు వంటి కీలక సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తుంటే, వాటిని విస్మరించి అనవసరమైన పథకాలను అమలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని, ఇది ప్రధాన సమస్యల నుండి దృష్టి మళ్లించే కుట్రలో భాగమని విమర్శించారు. ఉపాధ్యాయుల సంక్షేమం అంటే వారు కోరని సదుపాయాలు కల్పించడం కాదని, వారి న్యాయమైన ఆర్థిక, సేవా సంబంధిత హక్కులను అమలు చేయడమేనని గుర్తు చేశారు. డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పీఆర్సీ నివేదికను తెప్పించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయులు డీఏ, పీఆర్సీని అడిగితే, వాటిని “డైలీ అన్నం”, “ప్లేట్ రైస్ విత్ కర్రీ”గా పేర్కొంటూ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారని, ఇది ప్రభుత్వ విధానాల పట్ల ఉన్న అసంతృప్తికి నిదర్శనమని వారు తెలిపారు. ఉపాధ్యాయుల గౌరవానికి భంగం కలిగించే ఈ నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో పోరాటాలు తప్పవని వారు హెచ్చరించారు.

