5న సాహిత్య, సాంస్కృతిక సదస్సు
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్యక్రమం
ప్రజా పోరాటాలపై ఫాసిస్ట్ నిర్బంధానికి వ్యతిరేకంగా గళం
బుల్డోజర్ రాజకీయాలు, మత మైనారిటీల అస్తిత్వంపై ప్రత్యేక ఉపన్యాసాలు
సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించనున్న విరసం కళాబృందం
కాకతీయ, హైదరాబాద్: విప్లవ రచయితల సంఘం (విరసం) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 5న (ఆదివారం) హైదరాబాద్‌లోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారీ సదస్సు నిర్వహించనున్నారు. దేశంలో ప్రజా పోరాటాలపై అమలవుతున్న ఫాసిస్ట్ నిర్బంధం, అణిచివేతకు వ్యతిరేకంగా సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో పోరాటాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ సదస్సు కొనసాగుతుంది. ఈ సదస్సులో భారతదేశంలో ఫాసిజం ప్రత్యేకతలు, బుల్డోజర్ రాజకీయాలు, మత మైనారిటీల అస్తిత్వంపై జరుగుతున్న దాడుల వంటి అంశాలపై మేధావులు ఉపన్యాసాలు ఇస్తారు. అలాగే, తెలుగు సాహిత్యంలో ఇటీవల చోటుచేసుకుంటున్న ధోరణులు, వాటిపై మార్క్సిస్ట్ దృక్పథం అనే అంశాల పైనా లోతైన చర్చలు జరగనున్నాయి. సాయంత్రం వేళ విరసం కళాబృందం నాటక ప్రదర్శనతో పాటు, వివిధ ప్రజా కళాబృందాల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.
విజయవంతం చేయాలని విరసం పిలుపు
ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లను విరసం సిటీ యూనిట్ ఇటీవల ఆవిష్కరించింది. ప్రజా పోరాటాల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సాహిత్య రంగం నుంచే ప్రతిఘటనను బలోపేతం చేయాలని ఈ సదస్సు పిలుపునిస్తోంది. ఈ కార్యక్రమంలో భూపతి, రాము, శివరాత్రి సుధాకర్, రాంకి, శశిధర్, నారాయణ, స్వాతి తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యవాదులు, సాహితీ ప్రియులందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విరసం ప్రతినిధులు కోరారు.

