రైతు విత్తన మేళాకు సింగరేణి రైతుల తరలింపు
చింతకాని సభకు భారీగా బయలుదేరిన అన్నదాతలు
రైతు సంక్షేమానికి ప్రభుత్వ పెద్దపీట
కాకతీయ, కారేపల్లి: చింతకాని మండలం జగన్నాధపురం గ్రామంలో నిర్వహించనున్న ‘రైతు విత్తన మేళా’ కార్యక్రమానికి సింగరేణి మండల పరిధిలోని రైతులు గురువారం ఉత్సాహంగా బయలుదేరారు. మండలంలోని కోమట్లగూడెం, మాణిక్యారం, చీమలపాడు క్లస్టర్ల నుంచి పెద్ద సంఖ్యలో అన్నదాతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సింగరేణి మండల ఎంపీడీవో పద్మ, ఏవో అశోక్, ఏఈఓ మహేష్‌తో పాటు వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు, ఉప సర్పంచులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు, గాదెపాడు సర్పంచ్ భూక్య రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి విత్తన మేళాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మండల వ్యాప్తంగా రైతుల్లో విశేష స్పందన కనిపించిందని, మేళాను విజయవంతం చేసేందుకు అందరూ భాగస్వాములు కావాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

