- పేరు నమోదు చేసుకుంటేనే ఓటర్ల జాబితాలో పేరు కొనసాగుతుంది
- ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్
- ప్రతి ఓటరు నమోదులో భాగస్వామ్యం కావాలని పిలుపు
కాకతీయ, మణుగూరు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా, బూత్ లెవెల్ అధికారులు పంపిణీ చేసే ‘ఎన్యూమరేషన్ పత్రాన్ని’ ప్రతి ఒక్కరూ నింపి సమర్పించాలని నియోజకవర్గ ఈఆర్ఓ, భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సూచించారు. శనివారం మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఆయన పర్యటించి, ఓటర్ల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తిగా నింపితేనే డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో పేరు కొనసాగుతుందని, ఈ భారీ కసరత్తులో ప్రతి ఓటరు భాగస్వామి కావాలని పేర్కొన్నారు. 2002 తర్వాత జరుగుతున్న ఈ సమగ్ర సర్వేలో అర్హులైన వారిని గుర్తించి, బోగస్ ఓట్లను తొలగిస్తామన్నారు. ఒకవేళ జూలై 31న విడుదలయ్యే డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ‘ఫామ్-6’ ద్వారా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి ఓటరు తమ ఇంటికి వచ్చే బిఎల్వోలకు పూర్తి వివరాలు అందించి, ఫారాలు నింపి ఇచ్చి, రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, ఎలక్షన్ డ్యూటీ అధికారి అనూష, డిటి రామారావు, ఆర్ ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

