- 80 మందిని శస్త్రచికిత్సలకు తరలింపు
- రెండేళ్లలో 800 మందికి చూపు ప్రసాదించిన దేవాలయ కమిటీ
కాకతీయ, ఏటూరు నాగారం రూరల్ : ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని శ్రీ సాయిబాబా దేవాలయం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా ముగిసింది. శంకర ఐ హాస్పిటల్ సహకారం, రాహుల్ ఐ ఫౌండేషన్ ప్రోత్సాహంతో నిర్వహించిన ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దేవాలయ కమిటీ చైర్మన్ పెండ్యాల ప్రభాకర్ తన కుమారుడు పవన్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఏటూరు నాగారంతో పాటు పరిసర ఆరు మండలాల నుండి వందలాది మంది ప్రజలు శిబిరానికి తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో 80 మందికి కంటి శస్త్రచికిత్సలు అవసరమని నిర్ధారించారు.
వెంటనే వారిని భోజన సదుపాయాలతో కూడిన ప్రత్యేక బస్సులో హైదరాబాద్‌లోని శంకర ఐ హాస్పిటల్‌కు ఉచిత శస్త్రచికిత్సల కోసం తరలించినట్లు చైర్మన్ పెండ్యాల ప్రభాకర్ తెలిపారు. గత రెండేళ్లుగా ప్రతి నెలా ఈ శిబిరాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ, ఇప్పటివరకు 800 మందికి పైగా ఉచితంగా ఆపరేషన్లు చేయించి చూపు ప్రసాదించడం అభినందనీయమని స్థానికులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో శంకర ఐ హాస్పిటల్ వైద్య బృందం, రాహుల్ ఐ ఫౌండేషన్ చైర్మన్ రాహుల్, దేవాలయ కమిటీ సభ్యులు మరియు స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.

