- చండ్రుగొండలో మరో ‘దొంగ’ జాతకం బట్టబయలు!
- 30 ఎకరాల భూమి ఉండీ.. లేదంటూ మాయా సర్టిఫికెట్!
- కారుణ్య నియామకం.. పరిహారం పేరుతో రూ.లక్షల్లో కుచ్చుటోపి
- అధికారుల అండతో అడ్డదారిలో ఉద్యోగం.. బట్టబయలైన ఆధారాలు
- రెవెన్యూ రికార్డుల్లో అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా చండ్రుగొండ
కాకతీయ, మణుగూరు/ చండ్రుగొండ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ రెవెన్యూ కార్యాలయంలో ‘దొంగ సర్టిఫికెట్ల’ దందా పద్ధతి ప్రకారం జరుగుతోందన్నది తాజా ఘటనతో మరోసారి రుజువైంది. గతంలో వెలుగుచూసిన ఫోర్జరీ సర్టిఫికెట్ల ఘటనల మచ్చ పోకముందే, 30 ఎకరాల భూస్వామిని ‘నిరుపేద’గా చిత్రీకరిస్తూ జారీ చేసిన సర్టిఫికెట్, ఇప్పుడు జిల్లా యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ అక్రమ వ్యవహారంపై ‘కాకతీయ’ కథనం ప్రచురించిన నేపథ్యంలో, యంత్రాంగం కదిలింది. అటు రెవెన్యూ రికార్డులు, ఇటు రైల్వే పరిహార పత్రాల మధ్య పొంతన లేకపోవడంతో అసలు అక్రమదారుల చిట్టా బయటపడుతోంది. మద్దుకూరు గ్రామానికి చెందిన నల్లమోతు నాగేశ్వరరావు మరణానంతరం ఆయన కుటుంబం అనుసరించిన పద్ధతులు ఇప్పుడు అనుమానాలకు తావిస్తున్నాయి. 2015లో రెవెన్యూ అధికారుల నుంచి “ఆస్తిపాస్తులు లేవు, ఆదాయం లేదు” అంటూ ‘నో ప్రాపర్టీ’ సర్టిఫికెట్ పొందిన అదే కుటుంబం, కొద్ది కాలానికే రైల్వే భూ సేకరణలో తమ భూమికి సంబంధించి లక్షల రూపాయల పరిహారం పొందడం వెనుక పెద్ద కుట్రే ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మార్వో ఇచ్చింది బోగస్ సర్టిఫికెట్ అయితే, రైల్వేకు సమర్పించిన పట్టాదారు పాస్‌బుక్ నకిలీది అయి ఉండాలి. ఈ రెండు పత్రాల మధ్య ఉన్న వైరుధ్యాన్ని గుర్తించడంలో రెవెన్యూ అధికారులు ఎందుకు విఫలమయ్యారన్నది ఇప్పుడు కోటి రూపాయల ప్రశ్నగా మారింది.
అక్రమ ఉద్యోగం.. కారుణ్య నియామకంలో ‘మేనేజ్’
“ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం.. ఆస్తిపాస్తులు లేవు” అని దరఖాస్తు చేసుకున్న నల్లమోతు వాణికి, నిబంధనలను పక్కనబెట్టి రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వడం వెనుక ఉన్న ‘శక్తులు’ ఎవరనేది బయటపడాల్సి ఉంది. కారుణ్య నియామకాల్లో ఆర్థిక స్థితిగతులను క్షేత్రస్థాయిలో విచారించాల్సిన అధికారులు, కనీస బాధ్యత లేకుండా దొంగ సర్టిఫికెట్లను ప్రామాణికంగా తీసుకోవడం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. ఇదే కుటుంబం పేరు మీద అప్పట్లోనే భూములు ఉన్నట్లు ఆధారాలు దొరకడంతో, అధికారులకు లంచం ఇచ్చి ఈ అక్రమానికి పాల్పడ్డారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై చండ్రుగొండ తహసీల్దార్ జగదీశ్వర ప్రసాద్ స్పందిస్తూ తన వివరణ ఇచ్చారు. “గతంలో ఉన్న ఎమ్మార్వో హయాంలో ఈ సర్టిఫికెట్ జారీ అయిందని మా దృష్టికి వచ్చింది. 30 ఎకరాల భూమి ఉంచుకుని ఏమీ లేదని తప్పుడు ధ్రువీకరణ పత్రం తీసుకున్న వ్యక్తి వ్యవహారం తీవ్రమైనది. దీనిపై ఇప్పటికే విచారణ చేపట్టాం. ఈ అవకతవకలపై పూర్తిస్థాయిలో నివేదిక రూపొందించి జిల్లా కలెక్టర్‌కు పంపిస్తాం. తప్పు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. కార్యాలయానికి వచ్చి ఈ ఫైలుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించాను, త్వరలోనే క్షేత్రస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తాను అని తెలిపారు.
కలెక్టర్ జోక్యం అనివార్యం!
ప్రస్తుతం ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రెవెన్యూ వ్యవస్థలో వేళ్లూనుకున్న ఈ అవినీతిని తొలగించడానికి ఉన్నత స్థాయి విచారణ ఒక్కటే మార్గమని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కేవలం కిందిస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుంటే సరిపోదని, ఇన్ని రోజులుగా ఈ అక్రమాలకు మౌనంగా సహకరించిన అధికారుల బాధ్యతను కూడా ఖరారు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. వ్యవస్థను ప్రక్షాళన చేయకుంటే, ఇలాంటి ‘దొంగ’ సర్టిఫికెట్ల దందా మరిన్ని అక్రమాలకు దారితీసే ప్రమాదం ఉందని మేధావులు హెచ్చరిస్తున్నారు. తక్షణమే సంబంధిత వ్యక్తి ఉద్యోగంపై విచారణ జరిపి, తప్పుడు సర్టిఫికెట్ జారీ చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అప్పుడే రెవెన్యూ శాఖపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని బాధితులు కోరుతున్నారు.

