ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం
ఎస్సీ, ఎస్టీ కేసుతో వేధింపులే కారణం?
బాధితుడి కుటుంబ సభ్యుల ఆరోపణ
విషమంగా బాధితుడు రాజేందర్ రెడ్డి పరిస్థితి..!
మానకొండూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత
కాకతీయ, కరీంనగర్/మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త బేతల్లి రాజేందర్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మంగళవారం ఎల్ఎండీలోని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ఎదుట ఆయన తనపై తాను పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. స్థానికులు వెంటనే స్పందించి తీవ్ర గాయాలైన రాజేందర్ రెడ్డిని కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
వేధింపుల వల్లే అఘాయిత్యం
స్థానిక సమస్యలపై ప్రశ్నించినందుకే ఎమ్మెల్యే అనుచరుడు మురళీధర్ రెడ్డి తమ భర్తపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించాడని బాధితుడి భార్య ఆరోపించింది. ఆ కేసుతో తీవ్ర మనస్తాపానికి గురైన రాజేందర్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె తెలిపింది. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ ఘటనతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

