బడిలో పంతుళ్ల పంచాయితీ.. పరస్పరం దాడులు
తరగతి గదిలోనే ఘర్షణతో భయాందోళనలో విద్యార్థులు
కేసు నమోదు చేసిన చందుర్తి పోలీసులు
కాకతీయ, చందుర్తి : భావి భారతాన్ని తీర్చిదిద్దాల్సిన గురువులే పాఠశాల ఆవరణలో ఘర్షణకు దిగడం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తీవ్ర చర్చనీయాంశమైంది. బాధ్యతల కేటాయింపు విషయంలో గత ఏడాదిగా ప్రధానోపాధ్యాయుడు ఆనందరెడ్డి, సీనియర్ ఉపాధ్యాయుడు రామచంద్రం మధ్య నెలకొన్న విభేదాలు శుక్రవారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సీనియారిటీని పక్కనపెట్టి జూనియర్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారనే ఆరోపణలతో మొదలైన వాగ్వాదం తోపులాటకు దారితీసింది. తరగతి గదిలోనే ఉపాధ్యాయులు పరస్పరం చేయిచేసుకోవడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉపాధ్యాయుల తీరుపై తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న చందుర్తి ఎస్సై రమేష్ పాఠశాలకు చేరుకుని ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన చోట గురువులే వివాదాలకు కేంద్రబిందువుగా మారడం పట్ల గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాలలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని వారు కోరుతున్నారు.

