లారీ అసోసియేషన్‌కు చేర్యాల ఎస్సై అపూర్వ రెడ్డి హెచ్చరిక
కాకతీయ,చేర్యాల: జాతీయ రహదారిపై ఇసుక లారీలను నిలిపి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించవద్దని చేర్యాల ఎస్సై అపూర్వ రెడ్డి లారీ యజమానులు, డ్రైవర్లకు సూచించారు.ఈ మేరకు బుధవారం చేర్యాల లారీ అసోసియేషన్‌ను సందర్శించిన ఎస్సై.. రోడ్డు భద్రతపై సభ్యులకు అవగాహన కల్పించారు. జాతీయ రహదారిపై లారీలను నిలపడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొని ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని వివరించారు.కొద్దిసేపటి నిర్లక్ష్యం.. నిండు ప్రాణాలకు ముప్పు అని పేర్కొన్న ఎస్సై, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ జాతీయ రహదారిపై లారీలను నిలిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసుల సూచనలను పాటిస్తామని లారీ అసోసియేషన్ సభ్యులు హామీ ఇచ్చారు.

