- పెండింగ్ పనులు పూర్తి చేయాలి.. నాణ్యతలో రాజీ వద్దు
- పంచాయతీరాజ్ అధికారులతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమీక్ష
కాకతీయ, వేములవాడ : వేములవాడ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. సీఆర్‌ఆర్, ఎంఆర్‌ఆర్ గ్రాంట్లు, స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్, డీఎంఎఫ్‌టీ, ఈజీఎస్, సీఆర్‌ఆర్ ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో కొనసాగుతున్న పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
నాణ్యతలో రాజీ పడొద్దు
పనులు ఆలస్యమవుతున్న ప్రాంతాలను గుర్తించి వాటిని వేగవంతం చేయాలని, నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తైతే ప్రభుత్వ ధ్యేయం నెరవేరుతుందని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సమావేశంలో సిరిసిల్ల ఈఈ సుదర్శన్ రెడ్డి, వేములవాడ డీఈ విష్ణువర్ధన్, చందుర్తి డీఈ పవన కుమారి, కోరుట్ల డీఈ సత్యనారాయణ, ఏఈలు మనోహర్, అంజయ్య, సాయితేజ, జగదీశ్, సుచరిత్ తదితరులు పాల్గొన్నారు.

