రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్
బ్లాక్ స్పాట్లపై దృష్టి.. నిబంధనల అమలుకు ఆదేశం
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్ స్పాట్లపై సమీక్ష నిర్వహించి, రహదారులపై సంచరించే పశువుల కారణంగా జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు యజమానులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అతివేగం, మైనర్లకు వాహనాలు అప్పగించడం, సీటుబెల్టులు, హెల్మెట్లు ధరించకపోవడం వంటి ఉల్లంఘనలను అరికట్టేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలతో పాటు కట్టుదిట్టమైన అమలు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆర్ అండ్ బి ఈఈ నాగేశ్వరరావు, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణ, జిల్లా వైద్యశాఖ అధికారి తుకారాం రాథోడ్, జిల్లా పంచాయతీ అధికారి అనూషతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

