ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ బడులు
కాంగ్రెస్ హయాంలో విద్యకు పెద్దపీట
ప్రభుత్వ విప్ విజయరమణరావు
రూ.12 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు
రంగాపూర్, పెద్దపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో శంకుస్థాపనలు
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యే లక్ష్యం
కాకతీయ, పెద్దపల్లి : “ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది” అని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శనివారం పెద్దపల్లి మండలంలోని రంగాపూర్ ప్రభుత్వ పాఠశాల, పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో విద్యాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.12 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రంగాపూర్ ప్రభుత్వ పాఠశాలలో రూ.26 లక్షలు, పెద్దపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో రూ.20 లక్షలతో చేపట్టనున్న పనులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తున్నారని, గత ప్రభుత్వ హయాంలో విద్యాసంస్థలు నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, ఇటీవల పదో తరగతి ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనంతో పాటు టిఫిన్ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుందని, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

