ప్రేమ వివాహం.. పోలీసులను ఆశ్రయించిన యువజంట
కాకతీయ, కారేపల్లి: ప్రేమ వివాహం చేసుకున్న యువజంట తమకు ప్రాణహాని ఉందంటూ సింగరేణి పోలీసులను ఆశ్రయించింది. సింగరేణి మండలం బీసీ కాలనీకి చెందిన దండు సంజీవ్ (21), ముదిగొండకు చెందిన గాయత్రి (21) ఖమ్మంలోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివే సమయంలో పరిచయం ఏర్పడి, అనంతరం ప్రేమించి వివాహం చేసుకున్నట్లు తెలిసింది. వివాహం తర్వాత కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఇరు కుటుంబాల సభ్యులతో పోలీసులు మాట్లాడారు. పరిస్థితిని పరిశీలించి చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపడతామని సింగరేణి ఎస్సై గోపి, సీఐ నునావత్ సాగర్ తెలిపారు.

