క్విట్ కార్పొరేట్ ఉద్యమాన్ని విజయవంతం చేయాలి
కాకతీయ, చేర్యాల: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో చేపట్టిన ‘క్విట్ కార్పొరేట్’ ఉద్యమంలో రైతులు, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట మావో పిలుపునిచ్చారు. బుధవారం చేర్యాలలో నిర్వహించిన ప్రజాసంఘాల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలు రైతులు, కార్మికుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని విమర్శించారు. గిట్టుబాటు ధర, కనీస వేతనాలు, ఉపాధి హామీ పరిరక్షణ, ఉచిత విద్యుత్ వంటి డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 10న నిర్వహించే జైల్‌భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఆముదాల నర్సిరెడ్డి, బియ్య సిద్దులు, నంగి మైసయ్య, జక్కుల ఎల్లయ్య, ఇప్పకాయల శోభ తదితరులు పాల్గొన్నారు.

